: టీ టీడీపీ, కాంగ్రెస్ లకు భారీ షాక్... కేసీఆర్ తో ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ భేటీ
తెలంగాణలో టీడీపీకే కాక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు కూడా వరుస షాకులు కొడుతున్నాయి. టీడీపీకి వీర విధేయులుగా ఉన్న తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు తదితర నేతలు ఇప్పటికే పార్టీని వీడగా, కంటోన్మెంట్ కింగ్ గా పేరుపడ్డ ఎమ్మెల్యే సాయన్న కూడా సైకిల్ పార్టీకి షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. సాయన్నతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా ‘గులాబీ’ బాట పట్టారు. కొద్దిసేపటి క్రితం వీరిద్దరూ టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో కలిసి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీ తెలంగాణలో పెను కలకలమే రేపింది. ఇప్పటికే పార్టీ మారాలంటూ తనకు టీఆర్ఎస్ నుంచి ఆఫర్లు వచ్చాయని ప్రకటించిన సాయన్న, తాను మాత్రం పార్టీ మారేది లేదని తేల్చిచెప్పానని ప్రకటించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా పార్టీ కమిటీలను ప్రకటించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కమిటీల కూర్పులో సమతుల్యత పాటించలేదని ఆయన నిరసన గళం వినిపించారు. తనలాంటి సీనియర్లను పక్కనబెట్టిన చంద్రబాబు జూనియర్లకు పెద్ద పీట వేశారని కూడా బహిరంగంగానే తన అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే ఆయన కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సాయన్న లాంటి కీలక నేత పార్టీ వీడనుండటంతో టీడీపీకి పెను నష్టం తప్పేలా లేదు.