: స్కూటరెక్కిన మంత్రి పీతల... కిందపడ్డ గన్ మ్యాన్!


ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో. జనచైతన్య యాత్రలను ప్రారంభించిన సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా వేమూరులో బుల్లెట్ ఎక్కారు. కొంతదూరం బుల్లెట్ ను ఆయన నడపగా, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది సదరు బండిని పట్టుకుని కిందపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రబాబు బుల్లెట్ రైడ్ ను ఆయన కేబినెట్ లోని మహిళా మంత్రి పీతల సుజాత ఆదర్శంగా తీసుకున్నట్టుంది. జనచైతన్య యాత్రల్లో భాగంగా నిన్న పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పసుపు రంగులో ఉన్న స్కూటర్ ఎక్కారు. వెంట ఇద్దరు గన్ మెన్లు, జంగారెడ్డిగూడెం ఎస్సై మంత్రిగారి స్కూటర్ వెంట పరుగులు పెట్టారు. వంద మీటర్లో, రెండు వందల మీటర్లో అయితే ఫరవా లేదు కానీ, మంత్రి సుజాత ఏకంగా ఐదు కిలో మీటర్ల మేర స్కూటర్ పైనే వెళ్లారు. అంతదూరం ఆ ఇద్దరు గన్ మెన్లు, ఎస్సై మంత్రి గారి స్కూటర్ వెంటనే పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇంకొద్ది దూరం వెళితే మంత్రిగారి స్కూటర్ రైడింగ్ ముగుస్తుందనగా, ఆమె గన్ మన్ గంగాధర్ ఆయాసంతో తూలి కిందపడిపోయారు. అయితే మంత్రిగారి వెనుక వస్తున్న పార్టీ నేతలు తమ బైకులకు సడన్ బ్రేకులు వేయడంతో గంగాధర్ కు గాయాలేమీ కాలేదు. ఆ తర్వాత కింద నుంచి లేచిన గంగాధర్ కొద్దిసేపు కూర్చుండి మళ్లీ మంత్రిగారి స్కూటర్ వెంట పరుగు పెట్టారు.

  • Loading...

More Telugu News