: కాలిఫోర్నియాలో కాల్పులు... 14 మంది దుర్మరణం, మరో 17 మందికి గాయాలు


అమెరికాలో నిన్న రాత్రి దుండగులు రెచ్చిపోయారు. ఏకే 47 తుపాకులతో కారు నుంచి దిగిన ముగ్గురు ముష్కరులు ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 14 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగులపై కాల్పులకు దిగారు. పోలీసు కాల్పుల్లో ఓ దుండగుడు హతం కాగా మరో ఇద్దరు సమీపంలోని భవనాల్లో దాక్కున్నట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో వికలాంగుల సోషల్ సర్వీస్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. దాడికి పాల్పడ్డవారు ఎవరన్న విషయం కూడా ఇంకా తేలలేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అగ్రరాజ్యంపైనా విరుచుకుపడతామంటూ ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించిన నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఆరా తీశారు.

  • Loading...

More Telugu News