: వరదల్లో చిక్కుకున్నప్పుడు...పాటించాల్సిన జాగ్రత్తలు!
చెన్నైలో సోమవారం అర్ధరాత్రి వరకే 119.73 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. ఆ రాష్ట్రంలో వందేళ్ల నాటి వర్షపాతం రికార్డును ఇది బద్దలు కొట్టింది. అయితే, కుండపోతగా కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రహదారులు, కాలనీలు, రైల్వే ట్రాక్ లు, రన్ వే లపై వరదనీరు పారుతోంది. చెన్నైలోని పలు కాలనీలలో వరద నీరు చేరడంతో ప్రజలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఈ సందర్భంగా వరదల్లో చిక్కుకుపోయినప్పుడు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను సంబంధిత శాఖాధికారులు వివరించారు. * ఎలక్ట్రికల్, గ్యాస్ కు సంబంధించిన వస్తువుల వాడకం పూర్తిగా ఆపివేయాలి. డిస్ కనెక్ట్ చేయాలి. * ఎమర్జెన్సీ కిట్ ను దగ్గర పెట్టుకోవాలి. మీరు ఎక్కడున్నారన్న విషయాన్ని మీ బంధువులకు, మిత్రులకు తక్షణం తెలియజేయాలి. * వరదనీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, మురుగు, కెమికల్స్, ఇతర పదార్థాలతో ఆ నీరు కలిసి ఉంటుంది. * నీటి ప్రవాహం లేకుండా మామూలుగా ఉన్న నీటిలో నడిచి వెళ్లాల్సి వస్తే కనుక చేతికి ఊతంగా ఒక చిన్న కర్రను ఉపయోగించాలి. ఎందుకంటే, ఎక్కడ మాన్ హోల్స్ ఉన్నాయో, గొయ్యలు ఉన్నాయో తెలియదు కనుక. * విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి. ఒకవేళ విద్యుత్ వైర్లు కిందకు వేలాడినట్లుగా ఉన్నా, లేక కిందపడి ఉంటే కనుక వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. * వరద నీరు పోయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. పగిలిపోయిన సీసా ముక్కలు, పదునైన వస్తువుల వంటివి ఏవైనా ఉంటే గాయాలపాలవుతాము కనుక అడుగు వేసే ముందు పరీక్షగా చూడాలి. * వాతావరణ సమాచారం కోసం రేడియో వినడం మంచిది. వరదల్లో చిక్కుకున్నప్పుడు చేయకూడని పనులు... * వరద నీటి ప్రవాహంలో నడవద్దు * ఆ నీటిలో ఈత కొట్టేందుకు వెళ్లకూడదు * కొట్టుకు వచ్చిన ఆహార పదార్థాల జోలికి వెళ్లొద్దు * విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులకు వెంటనే పూనుకోవద్దు. సంబంధిత నిపుణుడు చెక్ చేసిన తర్వాతే లైట్లు, ఫ్యాన్లు వినియోగించాలి. గ్యాస్ లీక్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే కరెంట్ స్విచ్ వేయాలి. క్యాండిల్స్, లాంతర్లు వంటివి వెలిగించడం వంటి పనులు చేయాలి. * టీవీలు, వీసీఆర్ లు, సీఆర్ టీ టెర్మినల్స్ వంటి వాటిని ఆన్ చేసేటప్పుడు తడి నేలపై నిలబడవద్దు. * నిలిచిపోయిన వరద నీటిని తొలగించేందుకు వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించవద్దని, మొదలైన జాగ్రత్తలు, సూచనలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు.