: తెలంగాణకు వంద కోట్లు విడుదల చేస్తున్నాం: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్
తెలంగాణ రాష్ట్రానికి తక్షణ సాయం కింద రూ.100 కోట్లు విడుదల చేయబోతున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ న్యూఢిల్లీలో తెలిపారు. అలాగే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తున్నామని, వారు నివేదిక అందించిన వెంటనే రాష్ట్రానికి మరింత సాయం అందిస్తామని మంత్రి వివరించారు. అంతకుముందు ఢిల్లీలో రాధామోహన్ సింగ్ ను తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, టి.వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. తెలంగాణలో కరవు మండలాలను ఆదుకోవాలని కోరారు. కరవు మండలాలకు రూ.2,514 కోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరవు మండలాలకు సంబంధించి ప్రాథమిక నివేదికను కేంద్రానికి ఇప్పటికే పంపామని మంత్రులు గుర్తు చేశారు.