: కార్గిల్ యుద్ధంలో భారత్ అణుబాంబును ప్రయోగించాలనుకుందా?... బర్కాదత్ బుక్ లో కొత్త కోణం
భారత్, పాకిస్థాన్ ల మధ్య 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం మరిన్ని రోజులు కొనసాగి ఉంటే, పెను ప్రమాదమే సంభవించి ఉండేది. యుద్ధ భూమిలో అణు బాంబులు పడి ఉండేవి. పెను నష్టం జరిగి ఉండేదే. అయితే అప్పటికప్పుడు యుద్ధం ముగిసి హిరోషిమా, నాగసాకిల అనుభవాలు పునరావృతం కాలేదు. అసలు విషయమేమిటంటే, నాడు కార్గిల్ యుద్ధంలో పాక్ తన తప్పు తెలుసుకుని వెనకడుగు వేస్తే సరి, లేదంటే తాము వేసే తదుపరి అడుగు భయంకరంగా ఉంటుందని నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు తేల్చిచెప్పారు. ఈ మేరకు వాజ్ పేయి రాసిన లేఖను నాటి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా జెనీవాలో అమెరికా అధ్యక్షుడి ప్రతినిధికి అందజేశారు. ‘‘ఏదో విధంగా వారిని తరిమికొట్టేస్తాం’’ అని ఆ లేఖలో వాజ్ పేయి పేర్కొన్నారు. ఈ లేఖపై తాను చనిపోవడానికి రెండు నెలల ముందు బ్రజేష్ మిశ్రా ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయి లేఖను అందుకున్న అమెరికా ప్రతినిధి లేఖ అర్థమేంటని మిశ్రాను ప్రశ్నించారు. దీనికి మిశ్రా కాస్త లౌక్యంగానే సమాధానమిచ్చారు. అసలు విషయాన్ని అమెరికా ప్రతినిధికి చెప్పలేదట. అయితే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ లేఖ అర్థాన్ని బ్రజేశ్ వెల్లడించారు. ‘‘నియంత్రణ రేఖను దాటేందుకు వెనుకాడేది లేదు. అణు బాంబుల ప్రయోగం కూడా లేదని చెప్పలేను’’ అన్న కోణంలోనే వాజ్ పేయి ఆ లేఖ రాశారట. ఈ వివరాలను ఎన్డీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్కా దత్ రాసిన ‘‘దిస్ అన్ క్వైట్ ల్యాండ్- స్టోరీస్ ఫ్రం ఇండియాస్ ఫాల్ట్ లైన్’ పుస్తకంలో ప్రస్తావించారు. నాటి యుద్ధంలో భారత సైన్యం అనుసరించిన వ్యూహాలతో పాటు రచించి అమలు చేయని వ్యూహాలను కూడా బర్కాదత్ వివరించారు.