: రెచ్చిపోయిన పాతబస్తీ వడ్డీ వ్యాపారులు... మాదన్నపేట పీఎస్ పై దాడి, కానిస్టేబుళ్లకు గాయాలు


హైదరాబాదు పాతబస్తీకి చెందిన వడ్డీ వ్యాపారుల స్వైర విహారం నానాటికి పెరిగిపోతోంది. అధిక వడ్డీలకు అప్పులిస్తూ జనాన్ని పట్టి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులు తమ బాకీల వసూళ్ల కోసం హింసామార్గాన్ని ఎంచుకుంటున్నారు. అక్కడి వడ్డీ వ్యాపారుల దుర్మార్గాలకు ఇప్పటికే పలువురు అమాయకులు బలయ్యారు. తాజాగా అక్కడి వడ్డీ వ్యాపారులు ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడికి దిగారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే... పాతబస్తీలో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న రషీద్ అనే వ్యాపారి వద్ద హమీద్ అనే వ్యక్తి అప్పు తీసుకున్నాడు. వాయిదాల చెల్లింపుల్లో కాస్తంత వెనుకబడ్డ హమీద్ పై నిన్న రాత్రి రషీద్ తన అనుచరులతో కలిసి దాడికి దిగాడు. దీంతో భీతిల్లిన హమీద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రషీద్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న రషీద్ అనుచరులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ పై మెరుపు దాడి చేశారు. ఆ సమయంలో స్టేషన్ లో ఉన్న కానిస్టేబుళ్లపై పిడి గుద్దులు కురిపించి రషీద్ ను విడిపించుకుని పరారయ్యారు. రషీద్ అనుచరుల దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి తెగబడ్డ రషీద్ అనుచరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News