: జయలలితకు మోదీ ఫోన్... వర్ష బీభత్సంపై ఆరా!
తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న కురిసిన భారీ వర్షాలకు ఆ రాష్ట్ర రాజధాని చెన్నై సహా పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజుల క్రితం నుంచి మరోమారు భారీ వర్షం చెన్నై నగరంతో పాటు పరిసర జిల్లాలను సైతం ముంచెత్తింది. ఫలితంగా చెన్నై నగరం జలసంద్రంగా మారింది. నగరంలోని మెజారిటీ కాలనీలు నీట మునగగా, నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భవనాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. భారీ వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు కాగా, ఏకంగా చెన్నై ఎయిర్ పోర్ట్ మూతపడింది. రన్ వే పూర్తిగా నీట మునిగింది. నిన్న రాత్రికే 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇవి మళ్లీ ఎప్పుడు పునరుద్ధరణ అవుతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేశారు. వర్ష బీభత్సంపై ఆరా తీశారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడంతో పాటు అండగా ఉంటామని ఆయన జయలలితకు భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.