: ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం... నీరు-ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
నవ్యాంధ్రను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. నేటి సాయంత్రం విజయవాడలో ఆయన ‘నీరు-ప్రగతి’పై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 1.99 కోట్ల ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఈ భూమికంతటికీ సాగు నీరందించాలంటే 2,750 టీఎంసీల నీరు అవసరమవుతుందన్నారు. ఈ నీటిని అందుబాటులోకి తెచ్చేందుకే పట్టి సీమ వంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఈ ఒక్క ఏడాదిలోనే 80 టీఎంసీల నీటిని మళ్లించుకోగలిగామని చంద్రబాబు చెప్పారు. పెన్నా, గోదావరి, వంశధార తదితర నదులను అనుసంధానం చేయడం ద్వారా మిగిలిన నీటిని సాగు భూములకు మళ్లించుకోగలిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ హోదా లభించిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో నాలుగేళ్లు పడుతుందని ఆయన చెప్పారు. కరవు సీమ అనంతపురం జిల్లాలో ప్రతి పది హెక్టార్లకు ఓ నీటి గుంతను ఏర్పాటు చేయడం ద్వారా కరవును తరిమికొడతామని చంద్రబాబు పేర్కొన్నారు.