: నిరసన అంటే... దేశద్రోహమేనా!: మోదీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్న
మత అసహనంపై లోక్ సభలో నేటి సాయంత్రం జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్డీఏ సర్కారుపై ముప్పేట దాడి చేశారు. గుక్క తిప్పుకోకుండా ఆయన చేసిన విమర్శల దాడికి మోదీ ప్రభుత్వానికి నోట మాట రాలేదు. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల్లో ఏ ఒక్కదానిని విడిచిపెట్టని రాహుల్ గాంధీ, ఆయా అంశాలపై పదునైన వాగ్బాణాలను సంధించారు. ప్రస్తుతం దేశంలో నిరసన అంటే దేశద్రోహమనే అర్థమని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని చెబుతున్న గుజరాత్ లో పటేళ్ల ఆందోళనలు ఎందుకు మొదలయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఓబీసీ కోటా కోసం ఆందోళన బాట పట్టిన పటేళ్లపై దేశద్రోహం కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా వందలాది దేశద్రోహం కేసులు పటేళ్లపై నమోదయ్యాయని, దీనికి ఏం సమాధానం చెబుతారని కూడా రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు.