: సారా రహిత జిల్లాగా పాలమూరు... ప్రకటించిన జిల్లా కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ శ్రీదేవి ఈ మేరకు ప్రకటన చేశారు. జిల్లాలోని 1510 గ్రామాల్లో నాటుసారాను పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. 3 నెలల్లోనే జిల్లాలో గుడుంబాను కూడా అరికట్టామని, త్వరలోనే కల్తీ కల్లును కూడా పూర్తిగా అరికడతామని కలెక్టర్ వెల్లడించారు. సారా అమ్మకాలు, తయారీకి పాల్పడేవారిని గత మూడు నెలల్లో 3,854 మందిని బైండోవర్ చేసినట్టు చెప్పారు. వారిపై తిరిగి కేసు నమోదైతే రూ.లక్ష చెల్లించేలా బాండ్లు రాసిచ్చే పద్ధతిని తొలిసారిగా చేపట్టినట్టు వివరించారు. కేసులు నమోదైన వారిలో తిరిగి సారా కాచిన వారి నుంచి రూ.17.30 లక్షలు రాబట్టామని, దాంతో క్రమంగా సారా తయారీ, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని కలెక్టర్ వెల్లడించారు. సారా రహిత జిల్లాగా మహబూబ్ నగర్ ను ప్రకటించడంతో మహిళలు, స్వచ్ఛంద సంస్థల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.