: 'సాక్షి' స్థానంలో 'నమస్తే తెలంగాణ'... 'ఈనాడు'పై ఫైర్
గతంలో ఈనాడు, సాక్షి దినపత్రికల మధ్య నిరంతరం యుద్ధం జరిగేది. ఒకదానిపై మరొకటి వరుస కథనాలతో విరుచుకుపడేవి. ఇప్పుడు తాజాగా సాక్షి స్థానాన్ని నమస్తే తెలంగాణ ఆక్రమించినట్టుంది. తెలంగాణలో సర్క్యులేషన్ పెంచుకోవడంలో భాగమా, లేక అధికార పక్షానికి అండగా నిలబడే ప్రయత్నమో కాని... ఈనాడు దినపత్రికపై నమస్తే తెలంగాణ నిప్పులు చెరిగింది. డైరెక్ట్ గా ఈనాడు పేరును పేర్కొనకుండా ఓ పత్రిక అంటూ మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. 'ఎండబెట్టింది ఎవరు? రాజధానికి దాహార్తి అంటూ మీడియా దుగ్ధార్తి' అనే పేరుతో కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదులో తాగునీటి ఎద్దడిపై ఈనాడు ఆదివారంనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై మండిపడ్డ నమస్తే తెలంగాణ... గత పాలకుల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడిన కారణాన్ని వివరించకుండా, ఇదంతా తెలంగాణ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని విమర్శించింది. హైదరాబాదులో నీటి సమస్య వచ్చిన మాట నిజమే... కానీ, తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నదీ నిజమే అని పేర్కొంది. "మన కోసం బాధ పడుతున్నట్టే కనిపిస్తుంది. మన కోసం కొట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. మనపై ఎంతో ప్రేమ ఉన్నట్టే నటిస్తుంది. కానీ అది అంతా తెలంగాణను వైఫల్యంగా చూపించే కుట్రలో భాగంగా జరుగుతుందని మనకు ఎప్పుడో కాని అర్థం కాదు" అంటూ ఈనాడుపై పరోక్షంగా ధ్వజమెత్తింది.