: చేతులు కలిస్తేనే సరిపోతుందా?... మోదీ, నవాజ్ షేక్ హ్యాండ్ పై శివసేన కామెంట్
ప్రపంచ వాతావరణ సదస్సులో భాగంగా నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మధ్య కరచాలనం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. సదస్సుకు హాజరైన ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడమే కాక చేతులు కలిపి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత అక్కడే సోఫాపై కూర్చుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. సాధారణంగా ఇరువురు దేశాధినేతలు కలిస్తే వారి వారి ప్రతినిధులు పక్కనే ఉంటారు. అయితే నిన్నటి భేటీలో భాగంగా తమ ప్రతినిధులు లేకుండానే వారిద్దరూ ముచ్చట్లలో మునిగిపోయిన వైనం ఇరు దేశాల మధ్య మళ్లీ సత్సంబంధాలకు పునాది వేసిందన్న రీతిలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఆసక్తికర కలయికపై మరాఠా రాజకీయ పార్టీ, బీజేపీ మిత్రపక్షం శివసేన ఘాటుగా స్పందించింది. చేతులు కలిస్తేనే సరిపోతుందా? అంటూ ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల ప్రధానుల చేతులు కలిస్తేనే కాశ్మీర్ అంశం పరిష్కారం కాబోదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.