: ఆగ్రా ఎయిర్ బేస్ పై ఐఎస్ఐ గురి!... ఏడు సార్లు రెక్కీ నిర్వహించిన ఐజాజ్


ఆగ్రా ఎయిర్ పోర్టు బేస్... భారత సైన్యానికే కాక వైమానిక దళానికి కీలక కేంద్రం. దేశంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టు బేస్ గా ఉన్న ఆగ్రా ఎయిర్ బేస్.. భారీ మిలిటరీ ఆపరేషన్లను అత్యంత సమర్థవంతంగా ముగించింది. ఇంతటి కీలక ఎయిర్ బేస్ పై పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కన్ను పడింది. ధ్వంస రచనకు రంగంలోకి దిగింది. ముందుగా అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు తన ఏజెంట్ ఐజాజ్ ను భారత్ పంపింది. ఐఎస్ఐ రచించిన పక్కా ప్రణాళికతో ఐజాజ్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా సునాయసంగా భారత్ చేరుకోవడమే కాక ఓటరు కార్డు, ఆధార్ కార్డులను సంపాదించడంతో పాటు బ్యాంకు ఖాతాను కూడా ఓపెన్ చేయగలిగాడు. అంటే, పాక్ గూఢచారిగా దేశంలోకి అడుగుపెట్టిన ఐజాజ్ కు దాదాపుగా భారత పౌరసత్వం వచ్చేసింది. ఆ తర్వాత అతడు ఐఎస్ఐ రచించిన ప్రణాళికను అమలు చేసేందుకు రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఆగ్రాలో ఏడు సార్లు పర్యటించిన అతడు అక్కడి ఎయిర్ బేస్ కు సంబంధించిన స్థావరాలపై రెక్కీ నిర్వహించాడు. అదే క్రమంలో ఆగ్రాలో స్లీపర్ సెల్స్ ను కూడా ఏర్పాటు చేశాడు. ఎయిర్ బేస్ లో విమానాల ల్యాండింగ్, సైనికుల కదలికలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించిన అతడు వాటిని పాక్ లోని ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ కు చేరవేశాడు. ఇక మరికొద్ది రోజులుంటే విధ్వంసం జరిగేదేనేమో. ఈ క్రమంలో ఇటీవల మీరట్ లో ఐజాజ్ పోలీసులకు చిక్కిపోయాడు. విచారణలో భాగంగా తన కార్యకలాపాలన్నింటినీ అతడు వెళ్లగక్కక తప్పలేదు. ప్రస్తుతం అతడు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగ్రాలో విధ్వంసం జరగకముందే నగరంలోని స్లీపర్ సెల్స్ ను నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News