: కేసీఆర్ చండీయాగానికి రాష్ట్రపతి... 27న హాజరుకానున్నట్లు సమాచారం
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టనున్న అయుత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఈ నెల 23 నుంచి మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవలిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చండీయాగం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ యాగానికి రావాలని కేసీఆర్ ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ను కోరారు. ఇందుకు ప్రణబ్ కూడా సానుకూలంగానే స్పందించారు. శీతాకాల విడిది కోసం ప్రణబ్ ఈ నెల 18న హైదరాబాదుకు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ఈ నెల 31 దాకా ఉంటారు. ఈ క్రమంలో ఈ నెల 27న చండీయాగంలో ప్రణబ్ పాల్గొంటారని రాష్ట్రపతి భవన్ నుంచి కేసీఆర్ కు సమాచారం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.