: నా వ్యాఖ్యలు తప్పయితే ఉరి తీయండి: ఎంపీ సలీం
లోక్‌సభలో అసహనంపై చర్చ జరుగుతున్న సమయంలో సీపీఎం నేత మహమ్మద్ సలీం, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసహనంపై సలీం ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. నిజాలను ప్రస్తావిస్తే ఇంత అసహనం ఎందుకని, తాను చేసిన వాఖ్యలు తప్పయితే ఉరి తీస్తారా? తీయండి.. అంటూ సలీం ఊగిపోయారు. ఈ సందర్భంగా ఔట్‌లుక్ మ్యాగజైన్‌లో వచ్చిన కథనాలను సలీం ప్రస్తావించారు. 'విమర్శించే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు కారు. మీరు చెప్పేది ప్రపంచం వింటున్నప్పుడు.. ప్రపంచం చెప్పేది మీరు కూడా వినండి. ఔట్ గోయింగ్ కాల్స్ మాత్రమే కాదు.. ఇన్‌కమింగ్ కాల్స్‌ను కూడా స్వీకరించండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఏ ఆహారం తింటారనేది వారి వ్యక్తిగతం' అని సలీం పేర్కొన్నారు. కాగా, సలీం తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తాను ఎప్పుడూ ఇంతగా బాధపడలేదంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు లోక్ సభ నాలుగు సార్లు వాయిదా పడటం గమనార్హం.