: 15 రోజుల పోలీస్ కస్టడీకి చింటూ రాయల్...కడపలో అదుపులోకి తీసుకోనున్న పోలీసులు
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ ల హత్య కేసులో నేటి ఉదయం పలు కీలక పరిణామాలు ఒకదాని వెంట మరొకటిగా వరుసగా చోటుచేసుకున్నాయి. సొంత మేనమామ కఠారి మోహన్, ఆయన సతీమణి అనురాధలను పొట్టనబెట్టుకున్న చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ రెండు వారాల అజ్ఞాతవాసాన్ని వీడి నేటి ఉదయం ఊహించని విధంగా చిత్తూరులోని జిల్లా కోర్టుకు వచ్చి లొంగిపోయాడు. కేసులో పోలీసుల విచారణను ఎదుర్కోకుండానే అతడు నేరుగా కోర్టులో లొంగిపోయాడు. తన ముందు లొంగిపోయిన చింటూకు 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కేసులో కీలక నిందితుడిగా ఉన్న చింటూను ప్రశ్నిస్తేనే కాని హత్యకు గల కారణాలు పూర్తిగా వెల్లడి కావని వాదించిన చిత్తూరు పోలీసులు అతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు 15 రోజుల పాటు చింటూను పోలీస్ కస్టడీకి అనుమతించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు చింటూను పోలీసులు తొలుత కడపలోని సెంట్రల్ జైలుకు తరలించాల్సి ఉంది. ఇప్పటికే చింటూను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కడపకు తరలిస్తున్నారు. కడప సెంట్రల్ జైలు అధికారులకు చింటూను అప్పగించిన తర్వాత తిరిగి కోర్టు జారీ చేసిన కస్టడీ ఉత్తర్వులను జైలు అధికారులు అందజేసి అతడిని చిత్తూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత చింటూను కడపలోనే విచారిస్తారా? లేక చిత్తూరుకు తీసుకువచ్చి విచారిస్తారా? అన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు.