: ఆనం బ్రదర్స్ తో లాభం కన్నా నష్టమే అధికం... చంద్రబాబుకు ఈ-మెయిల్స్, ఫ్యాక్స్ ల వెల్లువ
టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఆనం రాంనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి సోదరులకు ఆ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీరు పార్టీలోకి వస్తే లాభం కన్నా, నష్టమే అధికంగా జరుగుతుందని ఆరోపిస్తూ, పలువురు దేశం తమ్ముళ్లు పార్టీ కార్యాలయానికి ఈ-మెయిల్స్, ఫాక్స్ ల ద్వారా ఫిర్యాదులు పంపుతున్నారు. నెల్లూరుకు చెందిన కొందరు తెలుగుదేశం నేతలు, ఆనం బ్రదర్స్ రాకను జీర్ణించుకోలేక, ఈ విధంగా మెయిల్స్ పంపిస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వీరిద్దరూ తెలుగుదేశంలోకి పునరాగమనానికి నిశ్చయించుకున్న తరువాత, గతంలో టీడీపీని, చంద్రబాబును విమర్శిస్తూ వారు చేసిన వ్యాఖ్యలను పలు టీవీ చానళ్లు ప్రసారం చేయడం కూడా వారికి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఇక వీరిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించే విషయమై సూత్రప్రాయంగా అంగీకరించిన చంద్రబాబు ఎటువంటి తుది నిర్ణయాన్ని తీసుకుంటారో వేచిచూడాలి.