: వరంగల్ లో తిరుపతి విద్యార్థినులు... నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డ దుండగులు
తెలంగాణలోని వరంగల్ నగరంలో నిన్న దారుణ ఘటన వెలుగుచూసింది. ఏపీలోని తిరుపతిలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై వరంగల్ లో నలుగురు దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై వేగంగా స్పందించిన ఇరు రాష్ట్రాల పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. వివరాల్లోకెళితే... చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన ఇద్దరు దళిత బాలికలు తిరుపతిలోని ఎస్సీ హాస్టల్ లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఈ నెలలోనే సొంతూరు నుంచి వచ్చి హాస్టల్ చేరిన బాలికలిద్దరూ పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై హాస్టల్ వార్డెన్ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. హాస్టల్ కు వెళ్లకుండా తిరుపతిలో రైలెక్కేసిన ఇద్దరు బాలికలు అదే రోజు రాత్రి వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. కొత్త ప్రదేశంలో దిక్కులు చూస్తున్న సదరు బాలికలను రైల్వే స్టేషన్ లోని ఓ దుకాణంలో పనిచేస్తున్న విశ్వనాథ్, సతీశ్ అనే యువకులు గమనించారు. బాలికల వద్దకు వచ్చి ఆరా తీశారు. తిరుపతి నుంచి వస్తూ అనుకోకుండా వరంగల్ లో దిగామని చెప్పిన బాలికలకు మాయ మాటలు చెప్పిన దుండగులు వారికి భోజనం పెట్టించి తమ గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న దుండగుల స్నేహితులు నజీర్, రాజేశ్ లు కూడా బాలికలపై లైంగిక దాడికి దిగారు. ఈ క్రమంలో బాధిత బాలికల్లో ఓ బాలిక వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని విజయవాడ చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలికను తీసుకుని వరంగల్ చేేరుకున్నారు. తమను నిర్బంధించిన గది వద్దకు పోలీసులను ఆ బాలిక తీసుకెళ్లింది. అయితే ఆ గదిలో రెండో బాలిక లేదు. దుండగులు కూడా అక్కడ లేరు. అక్కడ సోదాలు నిర్వహించిన పోలీసులు సతీశ్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతోంది. రెండో బాలిక ఎక్కడుందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.