: 'ఫ్లయింగ్ సిఖ్' అన్న పేరెందుకు వచ్చిందంటే.. స్వయంగా చెప్పిన మిల్కా సింగ్!
తనకు 'ఫ్లయింగ్ సిఖ్' అన్న పేరెందుకు వచ్చిందో పరుగుల వీరుడు మిల్కా సింగ్ స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్ లో జరిగిన 10కే రన్ పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన మిల్కా సింగ్ ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. "పాకిస్థాన్ లో అబ్దుల్ హాలిక్ అనే అధ్లెట్ అప్పట్లో చాలా వేగంగా పరుగెత్తేవారు. 1958లో టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో అతన్ని తొలిసారిగా కలిశాను. ఆ పోటీల్లో హాలిక్ ను నేను ఓడించాను. న్యాయ నిర్ణేతలు సైతం దాన్ని నమ్మలేకపోయారు. ఓ గంటపాటు చర్చించిన తరువాతనే విజేతగా నా పేరు ప్రకటించారు. టోక్యోలో నా ప్రదర్శనపై పాక్ లో సైతం చర్చ జరిగింది. ఆపై 1960లో లాహోర్ లో జరుగుతున్న పరుగుల పోటీలకు రావాలని ఆహ్వానం అందింది. నేను కొన్ని కారణాల వల్ల నిరాకరించాను. విషయం తెలుసుకున్న ఆనాటి ప్రధాని నెహ్రూ స్వయంగా నన్ను పిలిచి, పోటీలకు వెళ్లాలని సూచించారు. మొత్తం 50 మంది క్రీడాకారుల వరకూ బస్సులో బయలుదేరి పాక్ సరిహద్దులకు చేరగానే ఘన స్వాగతం లభించింది. బస్సు నుంచి దిగాలని నన్ను కోరిన పాక్ అభిమానులు, ఓ జీపు ఎక్కించి, అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలోని లాహోర్ వరకూ భారత జెండాలు చేతబట్టుకుని పూలు చల్లుతూ తీసుకెళ్లారు. లాహోర్ చేరుకున్న తరువాత పత్రికల్లో 'హాలిక్, మిల్కాల రూపంలో భారత్, పాక్ పోటీపడుతున్నాయి' అంటూ వార్తలు కనిపించాయి. మరుసటి రోజు జరిగిన పోటీలకు అప్పటి పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ వచ్చారు. ఆయన కళ్ళ ముందే పోటీ జరిగింది. నేను మొదటి స్థానంలో నిలువగా, మకన్ సింగ్ రెండో స్థానంలో, హాలిక్ మూడవ స్థానంలో నిలిచారు. నా మెడలో పతకం వేసే సమయంలో అయూబ్ ఖాన్ స్పందిస్తూ, 'మిల్కాజీ... మీరు పరుగు పెట్టలేదు. గాలిలో ఎగిరినట్టు మాకు అనిపించింది' అంటూ, 'ఫ్లయింగ్ సిఖ్' బిరుదును ఇస్తున్నట్టు వేదికపై వెల్లడించారు" అంటూ నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.