: 500 ఎకరాల విస్తీర్ణంలో, 40 అంతస్తులతో ఏపీ సెక్రటేరియట్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించనున్న సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చినట్టు సమాచారం. తొలుత, మిగిలిన నిర్మాణాలను పక్కన పెట్టి, సచివాలయాన్ని నిర్మించుకోవాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం వద్ద సెక్రటేరియట్ ను నిర్మించాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తం 500 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. 40 అంతస్తులతో, హరిత విధానంలో దీన్ని నిర్మించనున్నారు. 40వ అంతస్తులోనే ముఖ్యమంత్రి ఛాంబర్ ఉంటుంది. సీఎం పేషీ అధికారులు కూడా అదే అంతస్తులో ఉంటారు. మరోవైపు, మంత్రులు, వారికి సంబంధించిన అధికారులు ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. 44 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంటుంది. ఈ నిర్మాణానికి రూ. 3 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మరోవైపు, ఈ మొత్తాన్ని కేంద్రమే భరించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.