: నల్లారి పథకానికి నారా వారి కత్తెర!... చిత్తూరు తాగునీటి పథకాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు
ఓటరు మహాశయులు ఇచ్చే తీర్పుతో అప్పటిదాకా అధికారం వెలగబెట్టిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటే, విపక్ష స్థానాల్లో కూర్చున్న పార్టీలు పాలనా పగ్గాలు చేపడతాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో అప్పటిదాకా కొనసాగుతున్న కొన్ని పథకాలను రద్దు చేసేస్తున్న ప్రభుత్వాలు వాటి స్థానంలో తమ పేర్లతో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా చేరిపోయారు. చంద్రబాబుకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి ఆయన సొంత జిల్లా చిత్తూరుకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. జిల్లాను వేధిస్తున్న తాగు నీటి కొరతను తీర్చేందుకు చిత్తూరు తాగునీటి పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన నల్లారి, టెండర్ల ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు. పనులు ప్రారంభం కావడమే తరువాయి. అయితే ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పాటు నల్లారి పెట్టిన కొత్త పార్టీ కూడా ఘోరంగా దెబ్బతింది. ఈ క్రమంలో ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు సదరు పథకాన్ని రద్దు చేస్తూ నిన్న నిర్ణయం తీసుకున్నారు. కేవలం కొన్ని గ్రామాలకే పరిమితం కానున్న చిత్తూరు తాగు నీటి పథకానికి వందలాది కోట్ల రూపాయల నిధులు ఎందుకన్న కోణంలో ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.