: ఉత్తరప్రదేశ్ లో పాకిస్థానీ అరెస్టు... ఐఎస్ఐ ఏజెంటుగా నిర్ధారణ!
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత ఆర్మీకి చెందిన డాక్యుమెంట్లతో మీరట్ నుంచి ఢిల్లీ వెళ్తున్న మహ్మద్ ఇజాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిని పాకిస్థాన్ లోని ఇర్ఫానాబాద్ లో తారామండీ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద భారత ఆర్మీకి చెందిన డాక్యుమెంట్లు, పాకిస్థానీ గుర్తింపు కార్డు, పశ్చిమ బెంగాల్ కు చెందిన నకిలీ ఓటరు గుర్తింపు కార్డు, యూపీలోని బరేలీ నుంచి ఆధార్ కార్డు, ఢిల్లీ మెట్రో కార్డు, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్స్ లభించినట్టు టాస్క్ ఫోర్స్ ఐజీ సుజీత్ పాండే తెలిపారు. విచారణలో 2012 నుంచి తాను ఐఎస్ఐ ఏజెంటుగా పని చేస్తున్నట్టు వెల్లడించాడు. ఉత్తర భారత దేశంలో ఉండి ఆర్మీకి సంబంధించిన సమాచారం సేకరించే విధంగా శిక్షణ ఇచ్చారని ఇజాజ్ వెల్లడించాడు. పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ ఇజాజ్ బంగ్లాదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ కు వచ్చినట్టు విచారణాధికారులు తెలిపారు. మీరట్ లో సదార్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.