: అందగత్తెలందర్నీ ఆహ్వానించారు... ఆమెను మాత్రం అడ్డుకున్నారు!
'మిస్ వరల్డ్' ఫైనల్స్ చైనాలో నిర్వహించడం 'మిస్ కెనడా'కు ఇబ్బందిగా మారింది. తనను అందాల పోటీల్లో పాల్గొనకుండా చైనా అడ్డుకుంటోందని ఆమె వాపోతోంది. వివరాల్లోకి వెళ్తే... చైనాకు చెందిన అనస్తాసియా లిన్ పదమూడేళ్ల వయసులో కెనడా వెళ్లింది. అక్కడి టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటిస్తూ ఉండిపోయింది. ఆమె నటించిన పాత్రల్లో ఎక్కువ భాగం హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన పాత్రలే ఉన్నాయి. ఇప్పుడామెకు 25 ఏళ్లు. మిస్ కెనడా వరల్డ్ గా ఎన్నికైంది. ఆమె కెనడా తరపున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. ఆమెకు చైనా వీసా ఇవ్వలేదు. ప్రపంచ దేశాల అందగత్తెలకు ఆహ్వానం పంపిన నిర్వాహకులు ఆమెకు మాత్రం ఆహ్వానం పంపలేదు. దీంతో ఆమె కెనడా పర్యాటకురాలిగా స్పెషల్ ల్యాండింగ్ వీసాతో సాన్యా చేరుకున్నప్పటికీ, ఆమెను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో తనను అడ్డుకోవడం సరికాదని ఆమె పేర్కొంది. అయితే ఇది ఊహించినది కాదని ఆమె అభిప్రాయపడింది. తాను హక్కుల కోసం పోరాడడం చైనాకు ఇష్టం లేదని ఆమె చెప్పింది. చైనాలో హక్కులను ఎలా కాలరాస్తున్నారో చెప్పడానికి తానే పెద్ద ఉదాహరణ అని ఆమె అంటోంది.