: చంద్రబాబు స్వర నమూనాల సేకరణ తప్పదా?...టీ ఏసీబీ సన్నాహాలపై జోరందుకున్న చర్చ
తెలుగు రాష్ట్రాల మధ్య దూరం పెంచిన ఓటుకు నోటు కేసు దాదాపుగా క్లోజైందని భావిస్తున్న తరుణంలో మరోమారు ఆసక్తికర చర్చకు తెర లేచింది. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో అప్పటిదాకా హైదరాబాదు నుంచే ఏపీ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న టీడీపీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు తన మకాంను ఏకంగా విజయవాడకు మార్చేశారు. వారానికో, రెండు వారాలకో ఓ సారి హైదరాబాదు వస్తున్న ఆయన వెనువెంటనే తిరిగి విజయవాడ వెళుతున్నారు. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసులో కీలక సాక్ష్యాలుగా టీ ఏసీబీ భావిస్తున్న ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ పూర్తి అయ్యింది. ఏసీబీకి అందిన నివేదికలో టేపుల్లోని వాయిస్ లు నిందితులవేనని తేలింది. ఈ వ్యవహారంలో భాగంగా ఎల్విస్ స్టీఫెన్ సన్ తో చంద్రబాబు కూడా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై దృష్టి సారించిన టీ ఏసీబీ అధికారులు కోర్టులో అదనపు చార్జీషీటు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చార్జీషీటు వేసే ముందే చంద్రబాబు స్వర నమూనాలు సేకరించాలని వారు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సుహృద్భావ వాతావరణం దెబ్బతినే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.