: సిరిసిల్ల సారికది సూసైడే!... నిగ్గుతేల్చిన ఫోరెన్సిక్ నివేదిక


తెలుగు రాష్ట్రాలో పెను సంచలనం రేపిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవల దుర్మరణం ఘటన వెనుక ఉన్న కారణాలు ఎట్టకేలకు వెల్లడయ్యాయి. ఈ నెల 4న తెల్లవారుజామున వరంగల్ లోని రాజయ్య ఇంటిలో చోటుచేసుకున్న ఘటనలో సారిక తన ముగ్గురు పిల్లలు సహా సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సారిక ఆత్మహత్య చేసుకుందని కొందరు వాదించగా, సిరిసిల్ల రాజయ్య కుటుంబసభ్యులే సారికను మట్టుబెట్టారని మరో వాదన వినిపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుల విస్రా నమూనాలను హైదరాబాదులోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపారు. వీటిపై సుదీర్ఘంగా పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్ నిపుణులు నిన్న తమ నివేదికను వరంగల్ పోలీసులకు అందజేశారు. ఆత్మహత్య చేసుకున్న కారణంగానే సారిక చనిపోయిందని సదరు నివేదికలో ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరగనుంది. ఇప్పటికే ఈ కేసులో రాజయ్య సహా, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ (సారిక భర్త), అనిల్ రెండో భార్యగా భావిస్తున్న సనలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే వీరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక అందిన నేపథ్యంలో నిందితులకు బెయిల్ లభించే అవకాశాలు వున్నాయని అంటున్నారు.

  • Loading...

More Telugu News