: విజయవాడలో ప్రేమికుల గొడవ...పోలీస్ స్టేషన్ కు చేరిన వివాదం
కృష్ణా జిల్లా విజయవాడలో ప్రేమోన్మాది కలకలం రేపాడు. వినాయక థియేటర్ వద్ద బాషా అనే యువకుడు మహాలక్ష్మి అనే యువతిని గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నంచాడు. ఆమె అప్రమత్తమై కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. అయితే వారిలో శ్రీను అనే యువకుడిని బాషా తీవ్రంగా గాయపరిచాడు. దీంతో అతనిని అడ్డుకున్న స్థానికులు విషయం కనుక్కోగా, తాను, ఆ యువతి ప్రేమించుకున్నామని తెలిపాడు. తనను మోసం చేసిందని ఆరోపిస్తూ, అక్కడున్న చెట్లు, విద్యుత్ స్తంభాలకు తలను బాదుకుని గాయాలు చేసుకున్నాడు. ఇంతలో స్థానికుల్లో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో రంగ ప్రవేశం చేశారు. దీంతో స్థానికులు తనను గాయపరిచారంటూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోపక్క తనను చంపేందుకు ప్రయత్నించాడంటూ యువతి ఫిర్యాదు చేసింది. తనపై హత్యాయత్నం చేసిన బాషాను చెప్పుతో కొట్టింది. అయితే దీనిపై ఆ యువకుడు భిన్న కథనం వినిపించాడు. ఆ యువతి తన ప్రియురాలని కావాలంటే తన ఫోన్ లో ఉన్న మెసేజ్ లు చూడాలని తెలిపాడు. తాను వారింట్లో భోజనం కూడా చేశానని, కావాలంటే వారి కుటుంబం నివాసం ఉన్న ఏరియాలో విచారణ చేసుకోవచ్చని చెబుతున్నాడు. దీనిపై ఆ యువతి మాట్లాడుతూ, అతను తనను ప్రేమిస్తున్నానంటూ వెంటబడేవాడని, అతను ముస్లిం యువకుడైనందున ప్రేమ, పెళ్లి కుదరదని స్పష్టం చేశానని, అయినా తనను ప్రేమించాలని వెంటబడుతున్నాడని, కాదన్నందుకు చంపాలని ప్రయత్నించాడని ఆమె తెలిపింది. దీనిపై అక్కడి వారు మాట్లాడుతూ వారి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని, అయితే వివాహం కుదరదని యువతి చెప్పిందని, దీంతో ప్రేమ మొదలైన నాటి నుంచి ఐస్ క్రీంలు, చెప్పులు, పిన్నులు ఇలా తను కొన్న ప్రతి ఖర్చునూ లెక్కరాసి, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని బాషా డిమాండ్ చేస్తున్నాడని, ఆ క్రమంలోనే ఈ వివాదం, చోటుచేసుకుందని చెబుతున్నారు. విషయం పోలీసుల వద్దకు చేరడంతో పరిష్కారం ఏమవుతుందో వేచి చూడాల్సిందే.