: నిషేధం తప్పదన్న వార్తలతో నష్టాల్లో ట్రేడవుతున్న డాక్టర్ రెడ్డీస్!
అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఔషధాలను తయారు చేయడంలో విఫలమవుతోందని ఆరోపిస్తూ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్టు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) తాజా హెచ్చరికలు జారీ చేయడంతో ఈక్విటీ మార్కెట్లో సంస్థ విలువ భారీగా పడిపోయింది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే, క్రితం ముగింపుతో పోలిస్తే 10 శాతం దిగజారిన డాక్టర్ రెడ్డీస్ ఈక్విటీ రూ. 3,050కు పడిపోయింది. ఆపై కాస్తంత తేరుకుని 8 శాతం నష్టం వద్ద కొనసాగుతోంది. ఇండియాలో రెండవ అతిపెద్ద ఔషధ ఉత్పత్తుల సంస్థగా ఉన్న డాక్టర్ రెడ్డీస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ప్లాంట్లలో నాణ్యత సరిగ్గా లేదని ఈ నెల 5న యూఎస్ ఎఫ్డీయే హెచ్చరిక లేఖను పంపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెడ్డీస్ ఈక్విటీ విలువ దాదాపు 20 శాతం నష్టపోయింది.