: న్యాయం ఇంత నిదానమా?... 26 ఏళ్ల నాడు రూ. 11 తిన్నందుకు, ఇప్పుడు శిక్ష!
ఇండియాలో న్యాయస్థానాలు ఎంత నిదానంగా పనిచేస్తున్నాయో చెప్పడానికి ఈ కేసు మరో ఉదాహరణ. 1989లో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో 11 రూపాయల ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తిన్నందుకు ఓ నర్సుకు ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ. 100 జరిమానాను మీరట్ కోర్టు విధించింది. ఆమెతో పాటు అప్పట్లో ఆసుపత్రిలో ఉద్యోగిగా ఉన్న మరో వ్యక్తికి కూడా ఇదే శిక్షను విధించింది. ఇండియాలో సుదీర్ఘకాల విచారణకు తాజా ఉదాహరణగా నిలిచిన కేసు వివరాల్లోకి వెళితే, 1989లో యూపీ సర్కారు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ఒక్కో ఆపరేషనుకు రూ. 181 ఇస్తామని ప్రోత్సహించింది. ఇందులో రూ. 135 ఆపరేషన్ చేయించుకున్న వారికి, రూ. 40 వారిని ప్రోత్సహించిన మధ్యవర్తికి, రూ. 4 సర్జన్ కు, రూ. 1 చొప్పున నర్సు, స్వీపర్లకు ఇవ్వాలని నిర్ణయించింది. ఓ క్యాంపస్ లో 12 ఆపరేషన్లు జరుగగా, ఇవన్నీ బోగస్ అని అప్పటి కాస్ గంజ్ ఎమ్మెల్యే 1990 మార్చి 1న ఆరోపించారు. వీటిల్లో 11 కేసులు నకిలీవని విచారణలో తేలింది. ఎఫ్ఐఆర్ దాఖలు కాగా, 185 సార్లు కోర్టులో హియరింగ్ జరిగింది. నర్సు నూర్జహాన్, స్వీపర్ శోభారామ్ లు చెరో రూ. 11 తిన్నారని విచారణలో కోర్టు తేల్చింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్, బ్రోకర్, అకౌంటెంట్లు విచారణ జరుగుతున్న క్రమంలో మరణించారు. దీంతో మిగిలిన ఇద్దరికీ కోర్టు శిక్షను విధించింది.