: వరంగల్ ఫలితంపై పోస్ట్ మార్టం... ట్రస్ట్ భవన్ లో టీ టీడీపీ కీలక భేటీ
వరంగల్ ఉప ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన దేవయ్యకు డిపాజిట్ కూడా దక్కలేదు. మిత్రపక్షం బీజేపీ బరిలోకి దించిన దేవయ్యకు టీ టీడీపీ కూడా మద్దతునిచ్చింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. అయితే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ కు ఏకపక్షంగా ఓట్లు పడ్డాయి. టీ టీడీపీకి గట్టి పట్టున్న వర్ధన్నపేట, పాలకుర్తి వంటి నియోజకవర్గాల్లోనూ దేవయ్యకు కనీస ఓట్లు కూడా పడలేదు. దీని వెనుక ఉన్న కారణాలేంటీ?... వీటిని వెలికితీసేందుకు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ ముఖ్యులతో రమణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ సీనియర్లు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఘోర పరాభవం వెనుక ఉన్న కారణాలపై ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. సొంత పార్టీ నేతల వ్యవహార సరళిపైనా వారు దృష్టి సారించినట్లు సమాచారం.