: మీడియాను నిరోధించాలన్న అగ్రిగోల్డ్ లాయర్లు... కుదరదన్న హైకోర్టు
లక్షలాది మంది డిపాజిటర్లను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ మరో వితండ వాదన చేసింది. తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడుకు చెందిన లక్షలాది మంది మద్య తరగతి జనానికి అధిక వడ్డీలు ఆశచూపి వందల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం మెచ్యూరిటీ తీరిన డిపాజిట్లను చెల్లించడంలో చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి వందలాది ఫిర్యాదులు రావడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అగ్రిగోల్డ్ డిపాజిటర్లను నిలువునా ముంచేసిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి రంగం సిద్ధం చేసింది. కొద్దిసేపటి క్రితం ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాదులు మీడియా తమ క్లయింట్లపై అసత్య కథనాలను రాస్తోందని వాపోయారు. మీడియాను నిరోధించాలని డిమాండ్ చేశారు. అయితే అగ్రిగోల్డ్ న్యాయవాదుల అభ్యర్థనను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈ తరహా వ్యవహారాల్లో మీడియాను నిరోధించడం కుదరదని తేల్చిచెప్పింది. అంతేకాక ఆస్తులను అమ్మి డిపాజిటర్ల సొమ్ము చెల్లించేందుకు జరుగుతున్న చర్యలకు పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది.