: మోదీ ‘గోల్డ్’ స్కీంలో అతిపెద్ద డిపాజిటర్ గా తిరుమలేశుడు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన బంగారం పథకానికి (గోల్డ్ మోనిటైజేషన్ స్కీం) ప్రజల నుంచి స్పందన లభించలేదు. పథకం తీరుతెన్నులను తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు ఫోన్లు చేసినా, తమ ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీసేందుకు మాత్రం ముందుకు రాలేదు. ప్రధాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ పథకానికి ఇప్పటిదాకా కేవలం 40 తులాల బంగారం మాత్రం చేరింది. అయితే భక్తులు ఇచ్చే కానుకల విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న తిరుమల వెంకన్న సన్నిధి మాత్రం తన బంగారాన్నంతా ప్రధాని గోల్డ్ స్కీంలో డిపాజిట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భక్తుల నుంచి వెంకన్నకు అందిన బంగారాన్ని కరిగించి వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ), ఇప్పుడు ఆ బంగారాన్నంతటినీ ప్రధాని ప్రకటించిన గోల్డ్ స్కీంలో పెట్టేందుకు సిద్ధపడుతోంది. ఈ మేరకు ఇన్వెస్ట్ మెంట్ ప్యానెల్ నుంచి అనుమతి రాగానే బంగారాన్ని ప్రధాని గోల్డ్ స్కీంలో పెట్టుబడి పెట్టనున్నట్లు టీటీడీ చెబుతోంది. ఇదే జరిగితే, మోదీ గోల్డ్ స్కీంలో అతిపెద్ద డిపాజిటర్ గా తిరుమల వెంకన్న రికార్డులకెక్కనున్నారు.