: అమీర్ ఖాన్... ఈ 12 రోజుల 'మిస్టరీ' ఏంటో?
అమీర్ ఖాన్... బాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన హీరోల్లో ఒకరు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన గురించిన చర్చ జరుగుతోంది. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన భార్య భారత్ అంటే భయపడుతోందని, కొడుకు భవిష్యత్తు కోసం దేశం విడిచి వెళ్దామని అడిగిందని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ మూడు రోజుల నాడు... అంటే, 23న ప్రసారమైంది. అంతకు సరిగ్గా 12 రోజుల ముందు, 11వ తేదీన అమీర్ చేసిన వ్యాఖ్యలకు, ఈ వ్యాఖ్యలకూ ఎంతమాత్రమూ పొంతన లేకుండా పోవడం ఓ 'మిస్టరీ'ని తలపిస్తోంది. 11వ తేదీన ఓ కార్యక్రమంలో అమీర్ మాట్లాడుతూ, "మన మనసుల్లోని ఆలోచనలను, కోరికలను నెరవేర్చే వ్యక్తి ప్రధాని మోదీ రూపంలో లభించారు. ఆయనపై విమర్శలు గుప్పించకుండా, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ఇవ్వాలి. సంఘానికి మంచి చేస్తుంటే, వారు ఎవరైనా ప్రోత్సహించాలి" అని పొగడ్తల వర్షం కురిపించారు. ఇండియా మారుతోందని, ఆ మార్పును అందరూ చూస్తారని, భారతీయులకున్న ఆలోచనలు సరైన మార్గంలో నడుస్తూ, భవిష్యత్తుకు బంగారు బాటలు పరచనున్నాయని కూడా ఆనాడు అమీర్ వ్యాఖ్యానించారు. ఇక కేవలం 12 రోజుల వ్యవధిలోనే అమీర్ దృష్టిలో 'ఇన్ క్రెడిబుల్ ఇండియా' కాస్త 'ఇన్ టాలరెన్స్ ఇండియా'గా ఎలా మారిపోయిందో, దీని వెనకున్న మిస్టరీ ఏంటో ఆయనే చెప్పాలి.