: ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరు ఆగదు... వైఎస్ ఆత్మ బంధువు ప్రతిన
రాష్ట్ర విభజన తర్వాత ఓ ముక్కగా మిగిలిన ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరు ఆగదని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ బంధువు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ (రాజ్యసభ) కేవీపీ రామచంద్రరావు ప్రకటించారు. నేటి ఉదయం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గడచిన పార్లమెంటు సమావేశాల్లోనే ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరు సాగించామని ఆయన తెలిపారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ‘హోదా’ అంశంపై సభలో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. గడచిన సమావేశాల్లో ప్రైవేట్ తీర్మానం ప్రవేశపెట్టిన తాము ప్రైవేట్ బిల్లును కూడా ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేదాకా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని ఆయన ప్రకటించారు. లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన న్యాయమైన డిమాండేనని ఆయన పేర్కొన్నారు.