: వేడుకగా జయప్రద కొడుకు ‘సంగీత్’... స్టెప్పులేసిన జయసుధ
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కుమారుడు సిద్ధార్థ వివాహ క్రతువులో భాగంగా సంగీత్ కార్యక్రమం వేడుకగా జరిగింది. హైదరాబాదు శివారు ప్రాంతం శంషాబాదులోని సుచిర్ టింబర్ లీఫ్ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ లక్నో నుంచి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చారు. ఇక కార్యక్రమంలో భాగంగా తన సహ నటి జయసుధతో కలిసి జయప్రద స్టెప్పులేశారు. దుమ్మురేపే స్టెప్పులతో వీరు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. తన సోదరి కుమారుడైన సిద్ధార్థను జయప్రద దత్తత తీసుకున్నట్లు సమాచారం. తమిళ చిత్రం ‘ఉయిరే ఉయిరే’లో హీరోగా నటించిన సిద్ధార్థ పెళ్లి హైదరాబాదుకు చెందిన ప్రవల్లికారెడ్డితో ఖరారైంది. నిన్నటి సంగీత్ కు టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మీప్రసన్నతో కలిసి హాజరయ్యారు.