: నాడు అమ్మాయిలను ఆకర్షించేందుకు వాడుకున్నారు... నేడు రాళ్లతో దారుణంగా కొట్టి చంపారు!
2014లో సిరియాకు వెళ్లి ఫైటర్స్ గా మారిన ఇద్దరు యువతుల కథ విషాదాంతమైంది. ఆస్ట్రియా నుంచి సిరియాకు వెళ్లిన 17 ఏళ్ల సమ్రా కెసినోవిక్, 15 ఏళ్ల సబీనా సెలిమోవిక్ లను ఉగ్రవాదులు రాళ్లతో కొట్టి చంపినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం ముస్లిం అమ్మాయిలను ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ ఓ పోస్టర్ ను తయారు చేయగా, వాటిల్లో వీరి చిత్రాలనే ప్రచురించారు. ఆ తరువాత వీరి చేతుల్లో ఏకే-47 తుపాకులు ఉన్న చిత్రాలు, చుట్టూ జీహాదిస్టులు ఉన్న ఫోటోలు ఎన్నో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఐఎస్ఐఎస్ అత్యంత బలంగా ఉన్న రక్కా నగరంలోని ఓ గృహంలో వీరిద్దరూ సుమారు ఏడాది పాటు ఉన్నారని తెలుస్తోంది. కాగా, ఇటీవల వీరు రక్కా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, ఉగ్రవాదులకు పట్టుబడ్డారని, వీరిని నిలువెత్తు గుంతలో దింపి, రాళ్లతో దారుణంగా కొడుతూ ప్రాణాలు తీశారని పలు పత్రికలు వార్తలను ప్రచురించాయి. తాము ఇంటి నుంచి పారిపోయే రోజు "మా కోసం వెతకవద్దు. అల్లాకు సేవ చేసేందుకు మేం వెళుతున్నాం. ఆయన కోసం మా ప్రాణాలు అర్పిస్తాం" అంటూ నోట్ రాసి మరీ వీరు వెళ్లగా, ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.