: టీమిండియా స్పిన్ కు సఫారీ విలవిల... బంతితో మాయాజాలం చేస్తున్న అశ్విన్, జడేజా
ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా వన్డే, టీ20 టైటిళ్లను సునాయసంగా నెగ్గిన సఫారీలు టెస్టు సిరీస్ లో మాత్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో కూడిన టీమిండియా స్పిన్ కు దక్షిణాఫ్రికా దాసోహమైంది. తొలి టెస్టును నిర్దేశిత సమయం కన్నా ముందే ముగించిన టీమిండియా సఫారీ జట్టుకు షాకిచ్చింది. వరుణుడు అడ్డు తగలకుండా ఉంటే, రెండో టెస్టులోనూ అశ్విన్, జడేజాలు సఫారీల భరతం పట్టేవారేనేమో. తాజాగా నాగ్ పూర్ లో జరుగుతున్న మూడో టెస్టులో వీరిద్దరూ సఫారీలకు చుక్కలు చూపిస్తున్నారు. తొలి రోజు ఆటలో చెరో వికెట్ తీసుకున్న ఈ స్పిన్ ద్వయం, రెండో రోజు ఆటలో సింగిల్ పరుగు ఇచ్చి మూడు కీలక వికెట్లను కుప్పకూల్చారు. సఫారీ స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ ను జడేజా సున్నా పరుగులకే పెవిలియన్ చేర్చాడు. ఇక రెండో రోజు ఆటలో వేసిన తొలి ఓవర్ లోనే వికెట్ పడగొట్టిన అశ్విన్, తన రెండో ఓవర్ (రెండో రోజు ఆటలో మూడో ఓవర్)లో మరో వికెట్ నేలకూల్చాడు. వెరసి అశ్విన్, జడేజా బౌలింగ్ కు సఫారీ జట్టు విలవిల్లాడిపోతోంది. 10 పరుగులు చేసి జోరు మీదున్న డుప్లెసిస్ ను కూడా జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 20 ఓవర్లు ముగిసేసరికి సఫారీ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. సఫారీల వద్ద మరో నాలుగు వికెట్లే ఉండటంతో ఆ జట్టు వంద పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం డుమిని (14), డేన్ విలాస్ (0) క్రీజులో ఉన్నారు.