: సైకిలెక్కనున్న ‘ఆనం’ బ్రదర్స్!... డిసెంబర్ 5న ముహూర్తం ఖరారు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన పార్టీని వీడనున్న ఆనం బ్రదర్స్ ఇప్పుడు ‘సైకిల్’ పార్టీలోకి చేరనున్నారట. ఈ మేరకు డిసెంబర్ 5న వీరు టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైందని వార్తలు వస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చేపట్టిన మట్టి సత్యాగ్రహంపై అంతెత్తున ఎగిరిపడ్డ రాంనారాయణ రెడ్డి, నమ్ముకున్న పార్టీ తమ నెత్తిన మట్టి వేసిందని ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రధాన రాజకీయ కుటుంబానికి చెందిన రాంనారాయణ రెడ్డి నుంచి ఈ తరహా ప్రకటన వెలువడిన నేపథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని నాడే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ వీడతామని, వేరే పార్టీలో చేరతామన్న వార్తలను ఆనం ఖండించారు. అయితే తెర వెనుక జరిగిన భారీ తతంగంలో తొలుత వైసీపీలోకి వెళ్లాలన్న వారి యత్నాలు ఫలించలేదని సమాచారం. అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబం వైసీపీలో కీలక స్థానంలో ఉంది. అంతేకాక రాజకీయ ప్రత్యర్థి నల్లపురెడ్డి కూడా ఆ పార్టీలో ఉండటంతో అందులో చేరే మార్గం కనిపించలేదు. ఈ క్రమంలో టీడీపీ వైపు చూసిన ఆనం బ్రదర్స్ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఇంతకాలం వేచి చూశారట. ఇటీవలే చంద్రబాబు కూడా వారి చేరికకు సమ్మతించడంతో డిసెంబర్ 5న వారు లాంఛనంగా టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News