: మిసెస్ ఆమిర్ ఖాన్... తెలంగాణ బిడ్డ!


మత అసహనం తమను భయపెట్టిందని, దేశం వదిలి ఎక్కడికైనా వెళదామని తన భార్య చెప్పిందంటూ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మూడు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర లేపాయి. ఆమిర్ వ్యాఖ్యలపై మొత్తం బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గంపై మరో వర్గం కత్తులు దూసుకుంటూ పరుష పదజాలంతో కూడా వ్యాఖ్యలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ తతంగానికి తెర లేపిన వ్యక్తి ఆమిర్ భార్య కిరణ్ రావు ఇతివృత్తం అంశం కూడా చర్చకు వచ్చింది. దీనిపై ఆరా తీస్తే ఆసక్తికర అంశం వెలుగు చూసింది. బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయమై, ఆ తర్వాత ఆమిర్ కు రెండో భార్యగా సెటిల్ అయిన కిరణ్ రావు తెలంగాణ వాస్తవ్యురాలని తేలింది. తెలంగాణలో అత్యంత వెనుకబడ్డ జిల్లా పాలమూరు జిల్లాలోని వనపర్తి రాజుల వంశానికి చెందిన మహిళే కిరణ్ రావు అంటూ వెలువడిన కథనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ వివరాల్లోకెళితే... కిరణ్ రావు తాత గారు (తండ్రి వైపు) వనపర్తి రాజవంశీకులు. ఇక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన కిరణ్ రావు తండ్రి ఉద్యోగ రీత్యా బెంగళూరు, కోల్ కతా, ముంబైల్లో పనిచేశారు. ఈ నేపథ్యంలో 1973లో బెంగళూరులో జన్మించిన కిరణ్ రావు విద్యాభ్యాసం కూడా ఆయా నగరాల్లోనే సాగింది. కోల్ కతాలోని లొరెటో హౌస్ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన కిరణ్ రావు ముంబైలోని సోఫియా కళాశాల నుంచి ఎకనమిక్స్ లో డిగ్రీ పట్టా సాధించారు. ఆ తర్వాత ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. తదనంతరం సినీరంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె బాలీవుడ్ డైరెక్టర్ అశుతోశ్ గోవారికర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. ఇక ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘లగాన్’కు కూడా ఆమె పనిచేశారు. ఆ సమయంలోనే ఆమిర్ తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా వెళ్లింది. అప్పటికే పెళ్లి అయిన ఆమిర్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కొడుకు ఉన్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు అబుల్ కలాం ఆజాద్ (ఆమిర్ ఖాన్ కు ఆయన బంధువు) పేరు మీదుగా తన కొడుక్కి ఆజాద్ అనే పేరు పెట్టానని కిరణ్ రావు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కిరణ్ రావు పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో పాటు ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

  • Loading...

More Telugu News