: నమ్మశక్యం కాని ధరలతో కస్టమర్లకు 'షాక్' ఇచ్చిన కేఫ్ మద్రాస్!
మూడు ఇడ్లీలు 60 పైసలు, ఉప్మా 20 పైసలు, కాఫీ 5 పైసలు... ఈ ధరలు ఏదైనా హోటల్ లో ఉంటే ఆ హోటల్ కు వినియోగదారులు క్యూ కట్టేయరూ? అలాగే కట్టేశారు ముంబైలోని 'కేఫ్ మద్రాస్' అనే హోటల్ వద్ద! మంగళవారం నాడు ఆ హోటల్ లో ఈ ధరలు చూసిన వారికి ఇది నిజమా? లేక కలా? అనిపించింది. వినియోగదారుల ఆశ్చర్యాన్ని గమనించిన కేఫ్ మద్రాస్ యాజమాన్యం తమ సీక్రెట్ ను వెల్లడించింది. కేఫ్ మద్రాస్ హోటల్ ఏర్పాటు చేసి సరిగ్గా 75 సంవత్సరాలైందని చెప్పారు. 1940 నుంచి ఇప్పటి వరకు తమ వ్యాపారాభివృద్ధికి దోహదం చేసిన వినియోగదారులకు ఏదైనా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని భావించి, తమ హోటల్ ఆవిర్భావం నాటి ధరల పట్టిక ప్రకారం మంగళవారం నాడు అల్పాహారం అందించామని పేర్కొంది. దీంతో వినియోగదారులు తృప్తిగా తిని బెస్ట్ విషెస్ చెప్పి వెళ్లారు.