: భూగోళం మండిపోతోంది...జాగ్రత్త!: ఐక్యరాజ్యసమితి
భూతాపం పెరిగిపోతోందని ఐక్యరాజ్యసమతి తెలిపింది. 2015 లో నమోదైన ఉష్ణోగ్రతల కారణంగా అత్యంత వేడిమి కలిగిన సంవత్సరంగా రికార్డులకెక్కనుందని వెల్లడించింది. 2015 ప్రారంభం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి చెప్పింది. 2015లోని పది నెలల్లో భూ ఉపరితలం, సముద్ర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని వారు పేర్కొన్నారు. ఇది భూగోళానికి తీవ్ర ప్రతికూల అంశమని స్పష్టం చేసింది. 19వ శతాబ్దంతో పోల్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 1 డిగ్రీ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని తెలిపింది. 2014లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలను 2015 అధిగమించిందని చెప్పింది. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి బయటపడే పరిష్కారం మన చేతుల్లోనే ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కాగా, ప్రపంచ వాతావరణంపై వచ్చే వారం పారిస్ లో అంతర్జాతీయ సదస్సును ఐక్యరాజ్యసమితి వాతావరణ శాఖ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఈ వ్యాఖ్యలు చేసింది.