: నువ్వు, పిల్లాడు కొన్నాళ్లు ముంబయికి దూరంగా వెళ్లండి!: భార్యతో చెప్పిన అమీర్ ఖాన్!
కొడుకుని తీసుకుని కొన్నిరోజుల పాటు ముంబయికి దూరంగా ఎక్కడికైనా వెళ్లమంటూ తన భార్యకు బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ చెప్పాడని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతం ముంబయిలో ఉండటం మంచిది కాదని అమీర్ తన భార్యకు చెప్పినట్లుగా ఆ కథనాలు పేర్కొన్నాయి. ‘మీ రక్షణ గురించి నాకు భయంగా ఉంది. రెండు, మూడు రోజులు ముంబయికి దూరంగా వెళ్లండి’ అంటూ అమీర్ తన భార్యతో అన్నట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలొస్తున్నాయి. కాగా, ‘అసహనం’పై అమీర్ చేసిన వ్యాఖ్యల అనంతరం హిందూ మత సంస్థలతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు మండిపడిన విషయం తెలిసిందే. ముంబయి లోని అమీర్ ఖాన్ నివాసం ముందు హిందూ సేన మంగళవారం నాడు నిరసనలు వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల అమీర్ పై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబర్ 1న కాన్పూర్ సెషన్స్ కోర్టులో హాజరుకావాలని ఆయనకు సమన్లు కూడా జారీ అయ్యాయి.