: ఇన్ చార్జీ ప్రధానిగా సుష్మా స్వరాజ్!... మూడు రోజుల పాటు విధి నిర్వహణ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో ఉండగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సారథిగా ఎవరు వ్యవహరిస్తారు? ఇంకెవరూ, కేంద్ర హోంశాఖ మంత్రిగానే కాక మోదీ తర్వాత కీలక బాధ్యతల్లో ఉన్న రాజ్ నాథ్ సింగే. మరి ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్... ఇద్దరూ ఒకేసారి విదేశీ పర్యటనకు వెళితే, సర్కారు సారథి ఎవరు? ఇంకెవరు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజే కదా. అదేంటీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగానే కాక రక్షణ శాఖ మంత్రిగా కొంత కాలం పాటు కీలక శాఖలను నిర్వహించిన అరుణ్ జైట్లీ ఉన్నారుగా! అనేగా మీ అనుమానం. తొలుత రెండు శాఖల బాధ్యతలను మోసిన జైట్లీ, కేంద్ర కేబినెట్ లో మనోహర్ పారికర్ చేరికతో సింగిల్ శాఖకే పరిమితమయ్యారు. అయినా గతేడాది ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుస క్రమంలో తొలుత రాజ్ నాథ్ ప్రమాణం చేయగా, ఆ తర్వాత సుష్మా స్వరాజ్ పదవీ ప్రమాణం చేశారు. ఈ లెక్కన చూసుకున్నా, రాజ్ నాథ్ తర్వాత సుష్మానే ఉన్నారు. ఈ నెల 21న ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. అంతకు మూడు రోజుల ముందే ఈ నెల 18న రాజ్ నాథ్ సింగ్ కూడా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 23 దాకా సుష్మా స్వరాజ్ ఇన్ చార్జీ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొన్న చైనా పర్యటన ముగించుకుని వచ్చిన రాజ్ నాథ్ సింగ్, సుష్మా నుంచి ఇన్ చార్జీ బాధ్యతలను తీసుకున్నారు. నేటి ఉదయం విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ చేరుకోగానే రాజ్ నాథ్ ఇన్ చార్జీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

  • Loading...

More Telugu News