: లోక్ సభ టాప్ టెన్ ‘మెజారిటీ’ల్లో... ఐదు తెలుగోళ్లవే!
వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4.59 లక్షల రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు గతంలో వచ్చిన రికార్డు మెజారిటీ కంటే అధికంగా ఓట్లు సాధించిన దయాకర్, దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఏడో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన వారి జాబితాలో టాప్ టెన్ మెజారిటీలను ఓ సారి గుర్తుకు తెచ్చుకుంటే, వాటిలో ఏకంగా ఐదు స్థానాలు తెలుగోళ్లవే అన్న విషయం వెలుగుచూసింది. ప్రధానిగా దివంగత నేత పీవీ నరసింహారావు కర్నూలు జిల్లా నంద్యాల లోక్ సభ నుంచి 1991లో 5.8 లక్షల రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాతి స్థానం మాత్రం వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జగన్ ఏకంగా 5.45 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 1991లో సాధించిన రికార్డు మెజారిటీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ 4.22 లక్షల మెజారిటీతో రికార్డు విజయాన్ని నమోదు చేశారు. వైఎస్ రికార్డు విక్టరీ, పీవీ ఘన విజయం ఒకే ఎన్నికలో (1991) నమోదు కావడం విశేషం. ఇక అలుపెరగని ఉద్యమంతో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్ గడచిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నుంచి 3.97 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. ఈ రికార్డు విజయం టాప్ టెన్ లో పదో స్థానంలో నిలించింది. టాప్ టెన్ మెజారిటీల్లో బీజేపీ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి గోపినాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే గడచిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని బీద్ నియోజకవర్గం నుంచి 6.92 లక్షల మెజారిటీ సాధించి అగ్రస్థానంలో నిలిచారు. జాబితాలో పీవీ మూడో స్థానంలో నిలవగా, ఆ తర్వాత ఐదో స్థానంలో వైఎస్ జగన్, ఏడో స్థానంలో పసునూరి దయాకర్, తొమ్మిదో స్ధానంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, పదో స్థానంలో కేసీఆర్ ఉన్నారు. ఒకే నియోజకవర్గం (కడప) నుంచి బరిలోకి దిగిన తండ్రీకొడుకులు వైెఎస్ఆర్, జగన్ లు సాధించిన రికార్డు విజయాలకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. ఇక ఈ జాబితాలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ వడోదర నుంచి 5.7 లక్షల మెజారిటీతో సాధించిన రికార్డు విజయం నాలుగో స్థానంలో నిలిచింది.