: లాంగ్ లీవ్ లో రాహుల్ గాంధీ అప్పుడు ఎక్కడికెళ్లారో ఇప్పుడు తెలిసిపోయింది!
ఈ ఏడాది ప్రథమార్ధంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లాంగ్ లీవ్ తీసుకున్నారు. అది కూడా సరిగ్గా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందుగా సెలవుపై వెళ్లిన ఆయన సమావేశాలు ముగిసిన తర్వాత కాని తిరిగి రాలేదు. పర్యటనలో భాగంగా ఎక్కడికెళుతున్నారు? ఎన్ని రోజులు పర్యటన సాగుతుంది? అన్న విషయాలను చెప్పాపెట్టకుండానే ఆయన వెళ్లిపోయారు. నాడు బీజేపీ సహా పలు పార్టీలు రాహుల్ గాంధీ పర్యటనపై నిప్పులు చెరిగాయి. అయినా కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కాని పర్యటన వివరాలను వెల్లడించలేదు. తాజాగా రాహుల్ గాంధీ లాంగ్ లీవ్ లో ఎక్కడెక్కడికి వెళ్లారు? ఆయా ప్రాంతాల్లో ఎన్ని రోజులు బస చేశారు? తదితర వివరాలన్నిటీని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. ధాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ కేంద్రంగా సాగిన రాహుల్ పర్యటన నాలుగు దేశాల్లో కొనసాగింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. * ఫిబ్రవరి 16న న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీ అదే రోజు థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు. * ఒక రోజు బ్యాంకాక్ లోనే ఆయన బస చేశారు. * ఫిబ్రవరి 17న బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ఆయన కంబోడియా చేరుకున్నారు. 11 రోజుల పాటు అక్కడే ఉన్నారు. * కంబోడియా పర్యటనను ముగించుకున్న ఆయన ఫిబ్రవరి 28న తిరిగి బ్యాంకాక్ వచ్చారు. * ఒక రోజు బ్యాంకాక్ లోనే ఉన్న రాహుల్, మార్చి 1న మయన్మార్ వెళ్లారు. దాదాపు 21 రోజుల పాటు మయన్మార్ లోనే ఉన్నారు. * మార్చి 22న ధాయ్ ల్యాండ్ తిరిగివచ్చిన రాహుల్ ఆయుత్తయలోని బుద్ధిస్ట్ హెరిటేజ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడే ఆయన 9 రోజుల పాటు గడిపారు * మార్చి 31న వియత్నాం వెళ్లిన రాహుల్ ఏప్రిల్ 12న బ్యాంకాక్ తిరిగివచ్చారు. * ఏప్రిల్ 12 నుంచి 16 వరకు రాహుల్ గాంధీ బ్యాంకాక్ లోనే సేదదీరారు. * ఏప్రిల్ 16న తన సుదీర్ఘ సెలవును ముగించుకుని రాహుల్ గాంధీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. * 56 రోజుల పాటు రాహుల్ సెలవు పెట్టారని నాడు వార్తలు వినిపించాయి. అయితే వాస్తవానికి రాహుల్ గాంధీ సరిగ్గా 60 రోజుల పాటు సెలవులో ఉన్నారు.