: బాక్సైట్ తవ్వకాలపై శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాక్సైట్ తవ్వకాలపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ, బాక్సైట్ తవ్వకాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జీవో ఇచ్చారని అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అప్పటి సీఎస్ ను కాదని వైఎస్ 14 జనవరి 2005 లో రస్ అల్ ఖైమాతో ఒప్పందం చేసుకున్నారని, అందులో కొన్ని బ్లాకులు జిందాల్ కంపెనీకి ఇస్తామని కూడా ఒప్పందంలో పేర్కొన్నారని ఆయన తెలిపారు. నిజానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బాక్సైట్ తవ్వకాలు జరపాలని ఉండగా, ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పగించారని అన్నారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లోనే బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయని, అందులో ఒడిశా తరువాత ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక నిక్షేపాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఏపీలో 600 మిలియిన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఏపీలో ఖనిజం తవ్వేందుకు 9 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.