: ఆంధ్రా ప్రజలకు ‘చంద్రన్న సంక్రాంతి కానుక’!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత జూన్ లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ‘చంద్రన్న రంజాన్ గిఫ్ట్’ ను బాబు సర్కార్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐదు కిలోల గోధుమలు, రెండు కిలోల పంచదార, ఒక కిలో సేమ్యను అన్ని ముస్లిం కుటుంబాలకు నాడు అందజేశారు. కాగా, వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ కింద పేదలకు గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. సుమారు 1.3 కోట్ల కుటుంబాలు ఈ గిఫ్ట్ హ్యాంపర్లను అందుకోనున్నాయి. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. వచ్చే జనవరిలో ఇవ్వనున్న ఒక్కొక్క గిఫ్ట్ ప్యాక్ విలువ సుమారు రూ.280 వరకు ఉంటుంది. దీని కింద అర కిలో చొప్పున రెడ్ గ్రామ్, పామోలిన్ ఆయిల్, బెల్లం, ఒక్కొక్క కిలో చొప్పున బెంగాల్ గ్రామ్, గోధుమ పిండితో పాటు 100 గ్రాముల నెయ్యి కూడా ఇస్తారు. కాగా, ‘చంద్రన్న కానుకలు’ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఇట్లాంటి వన్నీ ఎందుకంటూ ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.