: డార్క్ నెట్ లేదా డీప్ వెబ్ ను ఎవరు ఉపయోగిస్తారో తెలుసా?
ఉగ్రవాద సంస్థలు తమ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కోసం, రిక్రూట్ మెంట్లు తదితర రహస్య వివరాలను తమ సభ్యులకు చేరవేసేందుకు ఇంటర్ నెట్ పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సంస్థలు సామాజిక మాధ్యమాలపై డేగ కన్ను వేశాయి. ఈ సందర్భంగా పలు ఉగ్రవాద సంస్థల ఎత్తులకు సంబంధించిన ఆసక్తికర అంశాలు వారి దృష్టికి వచ్చాయి. ఉగ్రవాదులు తమ కార్యకలాపాల కోసం వినియోగించే దానిని డార్క్ నెట్ లేదా డీప్ వెబ్ గా ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఎందుకంటే, దీని ద్వారా పంపే సమాచారం కనుగొనడం ఎవరి వల్ల కాదని తమకు తెలిసిందన్నారు. డార్క్ నెట్ లేదా డీప్ వెబ్ అంటే... తమకు సంబంధించిన వ్యక్తులు తప్పా వేరెవ్వరూ అనుసంధానం కావడానికి వీలులేని ఒక నెట్ వర్క్. ఒకవేళ సదరు సైట్ లోకి ఎవరైనా ప్రవేశించాలని ప్రయత్నించినా కుదరదు. ఎందుకంటే, చాలా ప్రాక్సీ సర్వర్లు అడ్డుకుంటాయి. ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తున్న ఉగ్రవాదులు... మొట్టమొదట ఒక లింక్ ను తమ సహచరుడి ఈ మెయిల్ కు ఈ నెట్ వర్క్ ద్వారా పంపుతారు. ఆ లింక్ పై కేవలం రిసీవర్ క్లిక్ చేస్తేనే సదరు సమాచారం కనబడుతుంది. ఐఎస్ఐఎస్ కు సంబంధించిన ఆన్ లైన్ ప్రచారకులు తమ రిక్రూట్ మెంట్లకు ఉపయోగించే ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో సైతం తమ సహచరులను కాంటాక్ట్ చేయడానికి, రిక్రూట్ చేయడానికి ఈ డార్క్ నెట్ కింద షెల్టర్ తీసుకుంటున్నారు.