: అమీర్ ఖాన్ కు భద్రత ఏర్పాటు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు భద్రతను ఏర్పాటు చేసినట్టు ముంబై సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మత అసహనంపై వెల్లువెత్తున్న విమర్శల నేపథ్యంలో అమీర్ కు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని భద్రత ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, నిన్న ఢిల్లీలో జరిగిన గొయెంకా ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ, దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు తమలో ఆందోళన పెంచుతున్నాయని, తన భార్య దేశం విడిచి వెళ్దామని సలహా కూడా ఇచ్చిందని పేర్కొన్నాడు. 'ఐదేళ్లు అధికారంలో ఉండండి, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోండి' అని రాజకీయ నాయకులకు అధికారం ఇస్తే పరిస్థితులు చక్కబెట్టడం లేదు సరికదా, వివాదాస్పద వ్యాఖ్యలతో సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని అమీర్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అతనికి భద్రత కట్టుదిట్టం చేశారు.