: వరద ప్రాంతాల్లో నష్టంపై రేపటిలోగా నివేదిక ఇవ్వండి: అధికారులకు సీఎం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రాంతాల పరిస్థితిపై సీఎం చంద్రబాబు కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరద నష్టం, పునరావాస కార్యక్రమాలపై కాన్ఫరెన్స్ లో పాల్గొన్న 7వేల మంది అధికారులతో చర్చించారు. వరదల వల్ల రేషన్ కార్డులు పోయినవారి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నష్టంపై రేపటి సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా ఇవ్వాలని సూచించారు.